పూర్వజన్మ- పునర్జన్మ(రెండవ భాగం)

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:58

భారతీయ పునర్జన్మ సిద్దాంతం :

సనాతన భారతీయ సిద్దాంతాలన్నీ పునర్జన్మ విశ్వసిస్తాయి. మరణం అనేది శరీరానికే కాని ఆత్మకు కాదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదాన్ని భారతీయులు అందరూ    విశ్వసిస్తారు. మరణించిన తరువాత వారి కర్మలను అనుసరించి వారు స్వర్గం లేదా నరకానికి పోతారని వారి కర్మ ఫలం అనుభవించిన తరువాత మరల భూలోకంలో పుడతారని భారతీయుల నమ్మకం.  కొన్ని పాశ్చాశ్చ దేశాల్లో పూర్వజన్మ పునర్జన్మని , పూర్వజన్మల్లో కర్మలను నమ్మేవారు కాదు.  కాని ఈమధ్య కాలంలో PAST LIFE  REGRESSION  సిద్దాంతంను నమ్ముతున్నారు.  వారికి కూడా భారతీయ పునర్జన్మ సిద్దాంతం మీద నమ్మకం కుదురుతోంది అని చెప్పవచ్చు.  టిబెట్ లో మరణించిన లామాలు తిరిగి జన్మించడం వారి పుర్వజన్మల్లో వారు వాడిన వస్తువులని గుర్తించడం ద్వారా తామే తిరిగి జన్మించామని ఋజువు చేయడం  మనలో చాలామందికి తెలుసు.  ఇలా అనేక నమ్మకాలు ఉన్నప్పటికీ భారతీయ పునర్జన్మ సిద్దాంతం విభిన్నమైనది .

ఇది పూర్తిగా కర్మ సిద్దాంతం అని చెప్పవచ్చు. మానవులు ఇప్పుడు అనుభవించే సుఖ-దుఖాలు, కష్ట-నష్టాలు, అన్నీ పూర్వ జన్మల్లో  వారు చేసుకున్న కర్మ ఫలాలే. ఇక్కడ కర్మ పని అని అర్ధం. పుట్టిన ప్రతి జీవి కర్మ చేయక తప్పదు.  ఆ కర్మ( చేసే పని ) ప్రభావం వారి భవిష్యత్తుని ( జన్మించింది మొదలు మరణించే వరకు )నిర్ణయిస్తుంది. మానవులు చేసిన సత్కర్మలవల్ల, పుణ్యకర్మలవల్ల స్వర్గలోకానికి వెళతారని వారి పుణ్యబలం క్షీణించిన తరువాత మరల భూలోకంలో పుడతారని పురాణాలవల్ల తెలుస్తోంది.పాప కర్మలు చేసినవారు కూడా భూలోకంలోనే జన్మ తీసుకొని కర్మ ఫలాన్ని అనుభవిస్తారు.  వారి కర్మలను అనుసరించి వారు పొందే జన్మ ఆధారపడి ఉంటుంది.

శుభేన కర్మణా సౌఖ్యం, దుఃఖం పాపేన కర్మణా "

సత్కర్మల వలన సౌఖ్యం, పాప కర్మల వలన దుఃఖము కలుగుతాయి అంటుంది శాస్త్రం.

పురాణగాథల్లో శాపాలు, వరాలు, పూర్వజన్మ వృత్తాంతాలు, తదనంతర జన్మలు ఈ కర్మల వల్లనే సంభవించినట్లు తెలుస్తుంది.

ఇక్కడ ఒక  విషయం మనం గమనించాలి.  స్వర్గంలో సుఖాలు లేదా నరకం లో శిక్షలు అనుభవించిన తరువాత మరల ఎందుకు జన్మిస్తారు.  మోక్షం ఎందుకు రావట్లేదు. కర్మఫలాన్ని పైలోకాల్లో యాతనా శరీరంతో అనుభవించి తీరని కోర్కెలు తీర్చుకోవడం కోసం మరల భూమిమీద జన్మిస్తారు. అయితే తీరని కోర్కెలతో మరణించినవారు రెండు రకాలుగా ఉంటారు.  సాత్వికమైన కోర్కెలు, తీవ్రమైన కోర్కెలు కలిగిన వారు ఉంటారు.  సాత్విక కోర్కెలు కలవారు దేవాలయం, స్కూల్ , హాస్పిటల్  కట్టించడం, అన్నదానాలు, ధార్మిక కార్యాలు చెయ్యడంలాంటి వాటికోసం జన్మిస్తే,  తీవ్రమైన  కోర్కెలతో మరణించినవారు దుర్మార్గులుగా , ప్రజలని భాధించే వారుగానూ, హత్యలు దోపిడీలు చేసేవారుగానూ , తీవ్ర వ్యసనపరులుగానూ జన్మిస్తారు.    

అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి.  మరణించిన తరువాత చేసే సంస్కారాలు పరిశీలిస్తే భారతీయులకు  మిగిలివారికి భేదం  ఉంది.  మరణించిన తరువాత భౌతిక శరీరాన్ని భారతీయులు దహనం చేస్తే  చాల సంస్కృతులలో పూడ్చిపెడతారు. భేదం ఏమిటి? దహనం ద్వారా ఆత్మకు ఆధారం అయిన  భౌతిక శరీరం నశించి ఆత్మ విముక్తం అవుతుంది.  దాని కర్మానుసారం కొత్త జన్మ తీసుకోవడానికి వీలుఅవుతుంది. మోక్షం కోసం అన్ని కోర్కెలు విడిచిపెట్టే సన్యాసాశ్రమం ఒక్క భారతీయులకే సొంతం.  మిగిలిన మతాల్లో మోక్షం అనే మాటే లేదని చెప్పవచ్చు. కాని సన్యాసి మరణించినప్పుడు సమాధి చేస్తారు. ఎందుకు? అన్ని కోర్కెలు విడిచిపెట్టిన  సన్యాసికి మరల జన్మించవలసిన అవసరం లేదు.  వారియొక్క ఆత్మ దైవత్వం పొంది  నిత్యనూతనంగా ఆ సమాధినందు ఉండి, తనను నమ్మిన వారికి మార్గదర్శనం చేస్తూ  ఉండడం కోసం  అ సమాధి మీద శివలింగం లేదా సాలగ్రామం ఉంచుతారు.  మామూలు మనుషులను పూడ్చిపెడితే సమాధి అని మహనీయులు అయిన వారిని పూడ్చిపెడితే బృందావనం లేదా అధిష్టానం అని పిలుస్తారు.

ఈరోజుల్లో ఎవరైనా మరణిస్తే, విదేశాల్లో ఉన్న వారిపిల్లలు వచ్చేవరకు పార్దివ శరీరాన్ని ఉంచుతున్నారు.  ఆత్మహత్య లేదా ప్రమాదాల్లో మరణించినవారికి కూడా అంతిమ సంస్కారం ఆలస్యం అవుతుంది.  ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నారాయణబలి, ఉదకశాంతి వంటివి అవసరంనుబట్టి చేసుకోవాలి.

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.