జ్యోతిషం ఎప్పుడు పుట్టింది? వేదం ముందు పుట్టిందా? జ్యోతిషం ముందు పుట్టిందా? నవగ్రహాలు అన్నీ ఒక్కసారే పుట్టాయా?

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 05:33

జ్యోతిషం ఎప్పుడు పుట్టింది? వేదం ముందు పుట్టిందా? జ్యోతిషం ముందు పుట్టిందా? నవగ్రహాలు అన్నీ ఒక్కసారే పుట్టాయా?
జ్యోతిషం ఎప్పుడు పుట్టింది ? జ్యోతిష శాస్త్రం ప్రామాణికత ఏమిటి?
ఇదొకఆధ్యాత్మిక వైజ్ఞానిక పరిశీలన.
జ్యోతిషం అంటే ఏమిటి. జ్యోతి అంటే కాంతి లేదా వెలుగు. జ్యోతిషం అంటే కాంతిని గురించి చెప్పే శాస్త్రం. వివిధ గ్రహాలనుంచి వెలువడే కాంతి దృశ్య లేదా అదృశ్య కాంతి (అల్ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్ రేస్) ప్రభావాలు గురించి చెప్పేదే ఈ జ్యోతిషం. ఈ శాస్త్ర ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తే "యధా శిఖా మయూరాణమ్ నాగానాం మణయో యధా" అన్నట్లుగా అన్ని శాస్త్రాల్లోకీ తలమానికమైన అయిన జ్యోతిషం వేదాలనుంచి ఉద్ధరింపబడి, వేదాంగ విద్యగా గుర్తించబడి, శాఖోపశాఖలుగా విస్తరించి సకల సృష్టికి మార్గదర్శి అవుతున్నది.

జ్యోతిషం ఎప్పుడు పుట్టిందో చెప్పాలనే ప్రయత్నం చేస్తే అసలు జ్యోతిషం ప్రస్తావన ఎక్కడ ప్రారంభమైంది అనేది తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ శాస్త్ర ప్రస్తావన వేదాలలో వున్నది.
ఈ సృష్టికి ఆధారం వేదం. వేదం ఆధారంగానే బ్రహ్మ సృష్టి చేస్తాడు. మనకి ఏదైనా సందేహం కలిగితే వేదం, పురాణం రెండిటినీ పరిశీలన చేసి సందేహ నివృత్తి చేసుకోవాలి. కానీ ఒక్కొక్కసారి మన సందేహం తీరదు సరికదా కొత్త సందేహం పుట్టుకొస్తుంది. ప్రస్తుతాంశానికి వస్తే జ్యోతిషం వేదాంగమని, ఈ శాస్త్రం గురించి వేదాలలో ప్రస్తావనలు ఉన్నాయి అనేది ఖచ్చితమైన వాస్తవం. ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకొంత జాగ్రత్తగా పరిశీలిద్దాం..


సృష్టి ప్రారంభమైనప్పుడు నవగ్రహాలతో సహా సృష్టి జరిగింది అని చెప్పలేం.ఎందుకంటే పురాణాలలోని నవగ్రహముల జన్మవృత్తాంతాలు పరిశీలిస్తే కశ్యప ప్రజాపతి సంతానం దేవతలు, రాక్షసులు అని, దక్ష ప్రజాపతి కుమార్తెలు 27 నక్షత్రాలు అని, వారి భర్త చంద్రుడు అని తెలుస్తోంది. దేవతల గురువు బృహస్పతి గురుగ్రహంగా స్థానాన్ని పొందాడు. ఈ గురుని భార్య తారకు, చంద్రునికి కలిగిన సంతానమే బుధుడు. ఇతడు కూడా గ్రహమండలంలో స్థానాన్ని పొందాడు. సూర్య భగవానుడు, అతని కుమారుడు శని కూడా గ్రహమండలంలో స్థానాన్ని పొందారు అని తెలుస్తోంది. అంటే సూర్యుడు స్థానము పొందిన తర్వాత చాలా కాలానికి శని స్థానము పొందాడు. రాహువు, కేతువు క్షీర సాగరమధన సమయంలో పుట్టారు అని తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్కసారి గ్రహమండలంలో చేరినట్లు కనబడుతోంది. ఇప్పుడు మనము జ్యోతిష శాస్త్రం ఎప్పుడు పుట్టిందని చెప్పాలి? సృష్టి తో బాటుగానా? తరువాత పుట్టిందా?
వేదాలలో ఒక మాట వుంది. "ధాతా యధా పూర్వ మకల్పయన్" అంటే బ్రహ్మ “ఇంతకు పూర్వం ఎలా వుందో అలానే సృష్టి చేసాడు” అని. ప్రళయాలలొ రెండు రకాల ప్రళయాలు వుంటాయి. ప్రళయం- మహా ప్రళయం. యుగాంతంలో వచ్చేది ప్రళయం. ఇలా యుగాంతంలో వచ్చే ప్రళయంలో సృష్టి మొత్తం లయం అయిపోదు. చాలా భాగము నశించి పోతుంది. సత్యవ్రతుని కధను చూస్తే ఈ విషయము మనకు తెలుస్తుంది. ప్రళయ సమయంలో శ్రీమహావిష్ణువు చేప రూపంలో సప్తరుషులను, ఓషధులతో సహా సత్యవ్రతుని కాపాడుతాడు.

ఇప్పుడు మనం చతుర్ముఖ ప్రజాపతి సృష్టి లో 7 వ మన్వంతరం లో వున్నాము. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంతకు ముందు వున్న 6 కల్పాలలో నవగ్రహాల పుట్టుక జరిగి ఉంటుంది. ప్రస్తుత కల్పం ప్రారంభమయ్యే సమయానికి నవగ్రహాలూ ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకుంటున్న జ్యోతిష శాస్త్రం వశిష్ట మహాముని కుమారుడు శక్తి అతని కుమారుడు పరాశరమహర్షి చెప్పినది. ఆయన కంటే ముందు చెప్పిన 14 మంది జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు చెప్పింది క్రోడీకరించి ఆయన తన పరాశరజ్యోతిష శాస్త్రాన్ని చెప్పారు . తరువాత జ్యోతిషం చాలా అభివృద్ది జరిగింది. దాని ఫలాలనే మనం ఇప్పుడు చూస్తున్నాం.

ఇప్పుడు ఇంకొక పరిశీలన చేద్దాం. వేదాలలో అన్నీ ఉన్నాయి అని అంటున్నాం. అది వాస్తవమేనా? పరిశీలన చేద్దాం. సృష్టికి ఆధారం వేదం అంటున్నాం. సృష్టి ప్రారంభం అయిన తరువాత కొంతకాలానికి గ్రహాల పుట్టుక జరిగింది అని పురాణాలు చెబుతున్నాయి. కాని వేదంలో నక్షత్రాలకీ, గ్రహాలకీ సంబంధించిన మంత్రాలున్నాయి. ఇది ఎలా సాధ్యం? రాబోయే కాలంలో వచ్చే గ్రహములకు మంత్రాలు ముందే వ్రాయబడ్డాయా? ఇది నిజం. మనకి సంతానం కలిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏమి చెయ్యాలో, దానికి ఏమి చదవాలో, మనం నిర్ణయం తీసుకుంటాం కదా? అదే విధంగా సృష్టి కర్త తన సృష్టిలో ఏ గ్రహం ఎప్పుడు ఏ పాత్ర పోషించాలో నిర్ణయిస్తాడు. నాటకంలో పాత్రదారులు అవసరాన్ని బట్టి రంగప్రవేశం చేసినట్టుగా సృష్టిలో అవసరాన్ని బట్టి ఆయా కాలాల్లో సృష్టిలో భాగాన్ని పంచుకొని వాటి పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పవచ్చు.

అసలు వేదాలు అపౌరుషేయాలు అని అంటున్నాం కదా? అంటే మనుష్యులచే వ్రాయబడినవి కాదని అర్థం. మరి మనకి వేదవిద్య ఎలా వచ్చింది? వేదాంగ విద్యలు ఎలా తెలిశాయి?. ఎందుకు అంటే మన ఋషులు తమ తపోబలంతో శబ్దతరంగాల రూపంలో వున్న వేదాలను సాక్షాత్కరించుకొని, మనకి పరంపరగా, మౌఖిక విద్యా రూపంలో అందించారు.

ఇప్పుడు గ్రహాలను ఆధునిక భౌతిక శాస్త్ర కోణంలో చూద్దాం. గ్రహాలని ను ఒక పదార్థం కాక ఒక శక్తి కేంద్రాలుగా చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు స్పష్టం అవుతాయి. ఎలాగంటే అయస్కాంతం- అయస్కాంత క్షేత్రంలాగ. అయస్కాంత క్షేత్రం ఉన్నప్పటికీ ఆ క్షేత్ర ప్రభావం కొన్ని లోహాలమీద మాత్రమే వుంటుంది. రాగిని ఆయస్కాంతం ఆకర్షించలేదు కాబట్టి అయస్కాంత క్షేత్రం అనేదే అబద్ధంఅని అనలేం కదా! ఆ విధంగానే అంతరిక్షంలో గ్రహాల ప్రభావం ( అది ఒక పదార్థం అని అన్నప్పటికీ అది ఒక శక్తి కేంద్రం కూడా కనుక ) భూమి మీద, మానవుని మీద వుంటుంది. ఏ గ్రహం నుంచి ఎంత శక్తి విడుదల అయి, ఎవరి మీద ఎంత ప్రభావాన్ని చూపుతాయో లెక్కించి, ఆ ప్రభావం భూమి మీద, ఇక్కడ నివసించే మానవులమీద, ఇతర జీవుల మీద ఎలా వుంటుందో చెప్పేదే ఈ జ్యోతిషశాస్త్రం. గ్రహ ప్రభావాలు మానవులమీదే కాకుండా సమస్త సృష్టి మీద వుంటుంది అనే విషయయంలో ఎంతమాత్రమూ సందేహం లేదు.

ఇంకా వివరంగా చూద్దాం.. ఒకసారి నేలలో విత్తిన విత్తనాలు అన్నింటి పంటా ఒకే విధంగా వుండదు. కొన్ని విత్తనాలు మొలకలే రావు. దీనికి సమాధానం చాలా రకాలుగా చెప్పవచ్చు. కొన్ని జంతువులు ఒకేసారి చాలా పిల్లలకు జన్మ ఇస్తాయి. అవి అన్నీ ఒకే రకంగా జీవించవు. అదే విధంగా ఒక తల్లి తండ్రులకు పుట్టిన పిల్లలు ఒకే రకంగా వుండరు. ఒకే క్లాసురూమ్లో చదివే పిల్లలు ఒకే లాగా చదవరు. కవలపిల్లలు జీవితాలు ఒకే విధంగా వుండవు. ఎందువల్ల?

ఈ విషయాలు అన్నిటిని వివరముగా చెప్పేదే జ్యోతిష శాస్త్రము.

ఒకే సమయంలో పుట్టినవారు జాతకం ప్రకారం ఒకేలాగ జీవించాలి. కానీ అలాగ జరగటం లేదు. గ్రహ ప్రభావాలు అందరిమీద ఒకేలాగా ఎందుకు ఉండటం లేదు? ఒకే సమయంలో ఒక ప్రధానమంత్రికి, ఒక కార్మికుడికి పిల్లవాడు పుడితే ఆ పిల్లల జీవితాలు ఒకేలాగా ఎందుకు వుండవు? ఇద్దరికీ గ్రహస్థితి ఒకేలాగా వుంటుంది కదా? సరిగ్గా ఇటువంటి సమయంలోనే పూర్వ జన్మ కర్మ ప్రభావం పనిచేస్తుంది. పూర్వ జన్మ కర్మ ప్రభావమే ప్రస్తుత జన్మల్లో మనం అనుభవించే కష్ట సుఖాలు. ఇటువంటి పూర్వ జన్మల కర్మలను వివరంగా చెప్పేదే జ్యోతిషం.
ఇక్కడే జ్యోతిషం ప్రభావమును- ప్రత్యేకత గుర్తించవచ్చు.

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.